
అనుభూతి మిగిల్చేలా సెలవులు
విద్యారణ్యపురి: దసరా సెలవుల్లో విద్యార్థులను చైతన్య పర్చేందుకు ఈనెల 20న ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో (పీటీఎం) సమావేశాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిఖ అధికారుల నుంచి డీఈఓలకు ఆదేశాలు అందాయి. ‘సంతోషకరమైన సురక్షితమైన దసరా సెలవులు’ అంశంపై ఉమ్మడి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, జిల్లాపరిషత్, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్‌లో పీటీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆయా జిల్లాల డీఈఓలు తమ జిల్లాల పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు.
మీటింగ్‌లో ఏం చెబుతారంటే..
(పీటీఎం)లో ‘మీ బాల్యంలో దసరా పండుగ ఎలా నిర్వహించుకున్నారు? ఆరోజుల్లో మీరు చేసిన సహసాలు, అనుభవాలు ఏంటి? బతుకమ్మ వేడుకల్లో పిల్లల్ని భాగస్వాముల్ని చేయాలి. దసరా సెలవులు ఆనందంగా సంతోషంగా గడిపేలా విద్యార్థులను ప్రోత్సహించాలి’ అని ప్రతీ పాఠశాల హెచ్‌ఎం విఽధిగా తల్లిదండ్రులకు రాతపూర్వకంగా లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించి తల్లిదండ్రుల ఈసమావేశాలకు హాజరయ్యేలా చూడాల్సి ఉంటుంది. మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు విధిగా వారి పరిధి పాఠశాల తల్లిదండ్రులతో సమావేశాలు జరగుతున్న తీరును పరిశీలించాల్సింటుంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులు, పట్టణ ప్రాంతాల్లోనైతే కూలీ పనులకు వెళ్తుంటారు అలాంటి వారికి వీలున్న వీలైన సమయం లో సమావేశాలు నిర్వహించాల్సింటుంది.
చర్చించాల్సిన అంశాలివే..
ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులున్నాయి. సెలవుల తర్వాత వచ్చే పరీక్షలకు కూడా సన్నద్ధమయ్యేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా పిల్లల బేస్‌లైన్ పరీక్ష, నిర్మాణాత్మక పరీక్షలు, ప్రిమిడ్ లైన్ పరీక్షల ఫలితాల గురించి చర్చిస్తారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందిస్తారు. హాజరుశాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడతారు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల్ని భాగస్వాముల్ని చేస్తారు.
సురక్షితంగా గడిపేలా..
● సెలవులను విద్యార్థులు సురక్షితంగా గడిపేలా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలిస్తారు.
● పూల సేకరణ వాటి ప్రాధాన్యం వివరించాలని చెబుతారు.
● చెరువులు, కుంటలు, వాగుల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వకుండా పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని సూచిస్తారు.
● సెలవుల్లో రోజుకో గంటపాటు చదివేలా పిల్లల్ని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు చెబుతారు.
● పర్యావరణ హితంగా దసరా పండుగను నిర్వహించుకునేలా మార్గదర్శనం చేయాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సూచిస్తారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు
నేడు పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు