
రైతుల సహకారంతోనే సొసైటీ అభివృద్ధి
● రైతులకు రూ.3.70 కోట్ల బోనస్
● ముల్కనూరు సొసైటీ 69వ వార్షిక మహాసభలో అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
ఎల్కతుర్తి: రైతులకు రూ.3.70 కోట్ల బోనస్‌ను పంపిణీ చేయనున్నట్లు ముల్కనూరు సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘం 69వ వార్షిక మహాసభ పారాబాయిల్డ్ రైస్‌మిల్ ఆవరణలో జరిగింది. ముందుగా సొసైటీ వ్యవస్థాపకుడు అల్గిరెడ్డి కాశీ విశ్వనాఽథరెడ్డి చిత్రపటానికి సంఘం సభ్యులు, అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభలో సంఘం మేనేజర్ రాజమౌళి వార్షిక నివేదిక చదివి వినిపించారు. అనంతరం పలు తీర్మానాల్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈసందర్భంగా సొసైటీ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన వివిధ పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం ద్వారా రూ.3 కోట్ల ప్రయోజనం చేకూరినట్లు తెలిపారు. ముల్కనూరు సొసైటీ సభ్యులకు 2024–25 వార్షిక సంవత్సరంలో రూ.242 కోట్ల అప్పులు ఇచ్చినట్లు వెల్లడించారు.
రుణ మాఫీ.. ఉపకార వేతనాలు
రుణ మాఫీ కింద 163 మంది సభ్యులకు రూ.1.20 కోట్లు మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనం కింద 125 మంది విద్యార్థులకు రూ.20 లక్షలు అందించామని, వృద్ధాప్య పింఛన్ 700 మందికి రూ.71 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. సంఘం సభ్యుల దహన సంస్కారాల నిమిత్తం 208 మంది సంఘ సభ్యులు మృతి చెందగా.. రూ.33 లక్షలు అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సంఘం సభ్యులకు 40 వేల బస్తాల యూరియాను సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులకు యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని రత్నగిరి, జగన్నాథ్‌పూర్ గ్రామాల్లో నూతన గోదాంలు నిర్మించనున్నట్లు తెలిపారు. మహాసభలో సొసైటీలో రూ.407 కోట్ల వ్యాపారం జరగ్గా.. రూ.7.18 కోట్ల నికర లాభంలో ఉన్నట్లు తెలిపారు. సభ్యుల సహకారంతోనే సంఘం అభివృద్ధి చెందుతుందని ప్రవీణ్‌రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో సొసైటీ బలోపేతానికి మరింతగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసభలో సంఘం జనరల్ మేనేజర్ రాంరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ అనసూయ, ఉపాధ్యక్షుడు గజ్జి వీరయ్య, సభ్యులు శ్రీనివాస్, వసంత, కుమారస్వామి, రాములు, కనకమ్మ, మహేందర్, రవీందర్‌రెడ్డి, మండ శ్రీనివాస్, బుచ్చయ్య, మూగయ్య, బాషు, భాస్కర్‌రెడ్డి, వీరారెడ్డి, సంఘం ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.