ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి

Sep 18 2025 6:39 AM | Updated on Sep 18 2025 6:39 AM

ప్రజా

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి

హన్మకొండ అర్బన్‌: ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పదేళ్ల కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి హామీలు, కాగితాలకే పరిమితమైందని, తమ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తోందన్నారు. హైదరాబాద్‌–సికింద్రాబాద్‌ నగరాల మాదిరిగానే హనుమకొండ–వరంగల్‌ నగరాలు కూడా కలిసి ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

త్వరలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ

పనులు ప్రారంభం..

2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,100 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2040 అవసరాలకు సరిపోయేలా మాస్టర్‌ ప్లాన్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, అలాగే, హనుమకొండ కలెక్టరేట్‌ బంగ్లాను ఆధునికీకరించినట్లు చెప్పారు. హైవేల విస్తరణలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌–ఐనవోలు (వయా) కూనూర్‌, గర్నేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు, ఓగ్లాపూర్‌–ధర్మారం వరకు 13 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు.

జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు..

భీమదేవరపల్లి మండలం వంగరలో రూ.7 కోట్లతో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. పరకాలలో రూ.35 కోట్లతో చేపట్టిన 100 పడకల ఆస్పత్రి పనులు సాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. క్రీడా పాఠశాల, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిందని, తాత్కాలికంగా జేఎన్‌ఎస్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రారంభించడానికి సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు.

ఆరోగ్యశ్రీతో పేదలకు ఉచిత వైద్యసేవలు..

గత ప్రభుత్వం నగరంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది పేదలు ఉచిత వైద్యసేవలు పొందుతున్నారని, జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత బస్సు సౌకర్యం, గృహలక్ష్మి పథకం ద్వారా వేలాది రాయితీ సిలిండర్లు, గృహజ్యోతి పథకం కింద లక్ష మందికి పైగా కుటుంబాలు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు.

435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు..

అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా జిల్లాలో 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, వేలాది మందికి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతో పాటు వేలాది మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా రేషన్‌ కార్డుల్లో చేర్చినట్లు చెప్పారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మత్స్య సంపద పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 771 చెరువుల్లో కోటికి పైగా చేపపిల్లలను వంద శాతం రాయితీతో పంపిణీ చేసినట్లు వివరించారు. వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఐదు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు..

విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తన, ఎరువుల కొరత అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాదాబైనామాతో భూసమస్యలు పరిష్కారమవుతాయని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తొలి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఇందిరా మహిళా శక్తి మిషన్‌ పాలసీని ఆవిష్కరించినట్లు తెలిపారు. 60 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పాలసీ –2024 ద్వారా రానున్న ఐదేళ్లలో సుమారు 4 వేల కోట్లు ఖర్చుచేసి పరిశ్రమలను స్థాపించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్‌ రంగంలో యువతకు మరింత ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు.

విదేశాల నుంచి పెట్టుబడులు..

రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామన్నారు. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్‌, దావోస్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించామని వివరించారు. హైదరాబాద్‌ వేదికగా పలు గ్లోబల్‌ ఈవెంట్లు నిర్వహించామని ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. మేయర్‌ సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్య, హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు, స్నేహ శబరీష్‌, సత్యశారద, గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాదాబైనామాతో

భూసమస్యలు పరిష్కారం

ముందు చూపుతో

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి

ప్రజాపాలన వేడుకల్లో

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి1
1/2

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి2
2/2

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement