
ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాప్రభుత్వం స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. 20 నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకుపోతోందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నగర పరిధిలో 7 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, 50 వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో 76,378 మందికి చేయూత పెన్షన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాప్‌రెడ్డి, ప్రజాకవి కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, సుద్దాల హనుమంతు, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి వంటి సాహితీమూర్తులకు నివాళులర్పించారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఈఈ రవికుమార్ పాల్గొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
బతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలిరోజు వేయిస్తంభాల ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించే బతుకమ్మ వేడుకకు లైటింగ్, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. హనుమకొండ పరిధి 26 ప్రాంతాల్లో, వరంగల్ పరిధి 20 ప్రాంతాల్లో అవసరమైన మేరకు లైటింగ్, డస్ట్‌తో పాటు రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. డీఈలు సారంగం, రవికిరణ్, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.