
కడియం శ్రీహరి చేసిందేమీ లేదు
● బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్
● మాజీ ఎమ్మెల్యే రాజయ్య
పాదయాత్ర ప్రారంభం
వేలేరు: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేలేరు మండల కేంద్రం నుంచి గండిరామారం రిజర్వాయర్ వరకు సాగునీటి పనుల పూర్తి కోసం చేస్తున్న పాదయాత్రను దాస్యం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. త్యాగాలకు కేరాఫ్ అడ్రస్ రాజయ్య అయితే, మోసాలకు కేరాఫ్ అడ్రస్ కడియం శ్రీహరి అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో సాగునీటి కోసం రూ.104 కోట్లతో కేటీఆర్ పనులు ప్రారంభించి మొదటి, రెండో దశ లిఫ్ట్ పనులు పూర్తిచేశామన్నారు. మూడో దశ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పైప్‌లైన్ పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వేలేరు నుంచి గండిరామా రం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీడబ్లూఎంసీ కార్పొరేటర్ రాధికరె డ్డి, మాజీ జెడ్పీటీసీలు తదితరులున్నారు.