● కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 23, ఆర్డీఓ హనుమకొండ 20, ఆర్డీఓ పరకాల 11, పీడీ హౌసింగ్ 18తో పాటు వివిధ శాఖలకు చెందిన మొత్తం 206 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వై.వి గణేశ్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈచిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సముద్రాల రాయలక్ష్మి. ఈమెది శాయంపేట మండలం గట్లకానిపర్తి. ఈమెకు ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఉన్న రెండెకరాల భూమిని కొడుకు పేరున రాసింది. కోడలు తిడుతోందని, బాగోగులు చూడట్లేదని, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతోందని కలెక్టర్‌కు విన్నవించింది. తన భూమి తన పేరు మీద రాసివ్వాలని, తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.
అర్జీలు త్వరగా పరిష్కరించాలి