
నిట్‌లో ముగిసిన సమ్మర్ ఇంటర్న్‌షిప్–2025
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సమ్మర్ ఇంటర్న్‌షిప్–25 ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిట్ వరంగల్‌లో తొలిసారిగా మే 9వ తేదీన ప్రవేశపెట్టిన సమ్మర్ ఇంటర్న్‌షిప్‌నకు అనూహ్య స్పందన లభించిందని, యూజీ, పీజీ నుంచి 194 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ప్రతిఏటా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ అకడమిక్, ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
15,16న క్రీడా శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియంలో గల క్రీడా శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు ఈ నెల 15, 16వ తేదీల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26వ సంవత్సరానికి నిర్వహించే ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు కలిగి తెలంగాణ క్రీడాకారులై ఉండాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడా సర్టిఫికెట్లు, స్టడీ, పుట్టిన తేదీ, 10 పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు ఆధార్ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రాలతో గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియం వద్ద హాజరు కావాలని సూచించారు.
అంకితభావంతో పనిచేయాలి
న్యూశాయంపేట : విద్యార్థుల పురోగతికి అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కే.ఏ.గౌస్ హైదర్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మైనార్టీ గురుకుల బాలుర కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న మెడిసిన్ కిట్‌ను పరిశీలించి, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శిరీష, అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్ పాష, అధ్యాపకులు పద్మ, ఆయేషా పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా నామినేషన్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డి.వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు 2025–26, 2026–27 సంవత్సరాలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా నామినేషన్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తులను హనుమకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహం..
కాజీపేట అర్బన్ : దివ్యాంగులకు ఎకనామికల్ రిహాబిలిటేషన్ స్కీంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమాధికారి జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేసేందుకు వందశాతం రాయితీతో 18 యూనిట్లు (రూ.50వేలు), 70శాతం సబ్సిడీతో లక్ష రూపాయలకు గాను 1 యూనిట్, 60శాతం సబ్సిడీతో రూ.3లక్షలకు గాను 1 యూనిట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో tgobmms.cgg. gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 14నుంచి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బాల పురస్కార్‌కు..
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమాధికారి జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికిగాను 18 ఏళ్లలోపు బాలబాలికలు ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలలు ఆన్‌లైన్‌లో awards.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పత్రాలను దరఖాస్తుకు జతపరిచి హనుమకొండ కలెక్టరేట్‌లోని జీ–1,జీ–2 గదుల్లోని జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమాధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు.

నిట్‌లో ముగిసిన సమ్మర్ ఇంటర్న్‌షిప్–2025