
మహిళను బెదిరించి నగలు, నగదు చోరీ
నెక్కొండ: ఒంటరిగా ఉన్న మహిళను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో బెదిరించి నగలు, నగదు దోచుకెళ్లిన సంఘటన పనికర గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి యాకయ్య కిరాణం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 11.30 గంటలకు పనిమీద బయటకు వెళ్తూ దుకాణాన్ని చూసుకొమ్మని భార్య నిరోశకు చెప్పి వెళ్లాడు. కొద్దిసేపటికి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మాస్కులు, హెల్మెట్ ధరించి దుకాణంలోకి చొరబడ్డారు. బంగారం, డబ్బులు ఎక్కడున్నాయని కత్తితో నిరోశను బెదిరించారు. బీరువాలోని గోల్డ్‌చైన్, రెండు గోల్డ్ రింగ్స్, కమ్మల మాటీలతోపాటు నగదు దొంగలు దోచుకుని పరారయ్యారు. వీటి విలువ సుమారు రూ.2.32 లక్షలు ఉంటుందని ఎస్సై పేర్కొన్నారు. పీఎస్‌ను తనిఖీ చేస్తుండగా విషయం తెలిసిన డీసీపీ అంకిత్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.