
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి
నర్సంపేట: విద్యుత్ వినియోగదారులు, రైతులు తమ పరిధిలోని ఉన్న విద్యుత్ సమస్యలను సెక్షన్ ఆఫీసర్ (అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్), గ్రామస్థాయిలో ఉండే లైన్‌మెన్‌కు తెలియజేయాలని వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతంరెడ్డి సూచించారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్ పరిధిలోని 33కేవీ లైన్‌ను శనివారం ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. భారీ వర్షాలు, గాలి దుమారంతో విద్యుత్ తీగలు తెగి పడితే వెంటనే సమాచారాన్ని ఏఈలకు తెలియజేయాలని కోరారు. తడిగా ఉన్న స్తంభాలను ముట్టుకోకూడదన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అత్యంత జాగ్రత్త వహించాలని, ఇంటిలోకి వచ్చే సర్వీస్ వైరు ఎలాంటి అతుకులు లేకుండా, ఇనుప రేకుల గుండా వెళ్లకుండా చూడాలని తెలిపారు. ఇళ్లలో నాణ్యమైన వైరింగ్ వాడాలని, రైతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించాలని సూచించారు. రైతులు, వినియోగదారులు స్వయంగా కరెంటు పనులను చేసుకోకూడదని పేర్కొన్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా టీజీ ఎన్పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీఈ టెక్నికల్ ఎ.ఆనంద్, నర్సంపేట డీఈ పి.తిరుపతి, ఏడీలు, ఏఈ, సిబ్బంది పాల్గొన్నారు.