‘డొమెస్టిక్‌’ దందా..! | - | Sakshi
Sakshi News home page

‘డొమెస్టిక్‌’ దందా..!

Jun 25 2025 3:07 PM | Updated on Jun 25 2025 3:07 PM

‘డొమె

‘డొమెస్టిక్‌’ దందా..!

సాక్షి, వరంగల్‌: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్‌) గ్యాస్‌ సిలిండర్లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ‘డొమెస్టిక్‌’ గ్యాస్‌ సిలిండర్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. వరంగల్‌ నగరంతోపాటు ప్రధాన పట్టణాలైన వర్ధన్నపేట, నర్సంపేటతోపాటు వివిధ మండల కేంద్రాల్లో జోరుగా ఈ దందా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా టిఫిన్‌ సెంటర్లు, హోటల్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, మెస్‌లలో దొంగచాటుగా ఇంటి సిలిండర్లను వాడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులకు ఇదొక తెరచాటు వ్యాపారంగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. అయితే డొమెస్టిక్‌ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇటీవలి కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్‌ సిలిండర్లు మాత్రమే వినియోగించాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిబంధన అమలుకావడం లేదు. ఎందుకంటే 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.2,185 ఉంది. అదే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ విలువ రూ.894.6 ఈ లెక్కన కమర్షియల్‌ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్‌ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చనేది వ్యాపారుల ఆలోచనగా తెలుస్తుంది. గ్యాస్‌ ఏజెన్సీలను మచ్చిక చేసుకొని డొమెస్టిక్‌ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్‌ ఏజెన్సీలకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 కు పైగా లాభం రావడంతో డొమెస్టిక్‌ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. దీనికితోడు సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఏజెన్సీలతో మిలాఖత్‌ అయ్యారనే ఆరోపణలున్నాయి.

జిల్లాలో నాలుగు లక్షల గ్యాస్‌ కనెక్షన్లు..

జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 12 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల పరిధిలో గృహ అవసర(డొమెస్టిక్‌) గ్యాస్‌ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షలకుపైగా ఉన్నాయి. వాణిజ్య సిలిండర్‌ కనెక్షన్లు సుమారు మూడు వేల వరకు ఉన్నాయి. నెలకు రీ ఫిల్లింగ్‌ అవుతున్న గృహవసర సిలిండర్లు దాదాపు 60 వేల వరకు, కమర్షియల్‌ సిలిండర్లు వెయ్యి వరకు ఉన్నట్లు సమాచారం. డొమెస్టిక్‌ సిలిండర్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తే కిలోకు రూ.63, కమర్షియల్‌ అయితే రూ.115 వరకు వసూలు చేస్తున్నారు.

‘మామూలు’గానే తనిఖీలు...

జిల్లా అంతటా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, టిఫిన్‌ సెంటర్లు, ఇతర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ములుగు రోడ్డు నుంచి జానిపీరీల వరకు, ఎంజీఎం నుంచి బట్టల బజార్‌ బ్రిడ్జి వరకు, పోచమ్మ మైదాన్‌ నుంచి వరంగల్‌ చౌరస్తా మీదుగా స్టేషన్‌రోడ్డు వరకు, బీట్‌ బజార్‌, వరంగల్‌ ఫోర్ట్‌ రోడ్డు, ఇలా అనేక సెంటర్లలో యథేచ్ఛగా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల వాడడం చూస్తుంటే అధికారులు ఏ మేరకు తనిఖీలు చేపడుతున్నారో తెలుస్తుంది. కమర్షియల్‌ సిలిండర్లు హోటళ్ల సామర్థ్యం ఆధారంగా వారంలో ఒకటి నుంచి రెండు, మరికొన్నింటిలో నెలకు ఐదు నుంచి ఎనిమిది వినియోగిస్తున్నారు. ఎంత చిన్న హోటల్‌ అయినా.. ఒక కమర్షియల్‌ సిలిండర్‌తో కొనసాగించడం కష్టమే.. దీంతో డొమెస్టిక్‌ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తూ తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. కారులు, ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు ఎక్కిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉపయోగించే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి.

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్లు

ఒక్కో సిలిండర్‌పై

రూ.200కు పైగా వసూళ్లు

‘మామూలు’గానే అధికారుల తనిఖీలు

‘డొమెస్టిక్‌’ దందా..!1
1/1

‘డొమెస్టిక్‌’ దందా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement