
నెరవేరనున్న దశాబ్దాల కల
నర్సంపేట: రైతుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరనుంది. చెన్నారావుపేట గ్రామ శివారులోని పాకాల వాగుపై చెక్‌డ్యాం, వంతెన, రోడ్డు మంజూరయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులను మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురం గ్రామానికి చెందిన ఏ–వన్ కాంట్రాక్టర్ సుధీర్‌రెడ్డి టెండర్‌లో దక్కించుకున్నారు. శనివారం పాకాల వాగు పరిసరాలను ఇటాచీ సాయంతో శుభ్రం చేయించారు. కొద్ది రోజుల్లోనే ఈ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. సమీప గ్రామాల ప్రజ లు పాకాల వాగు దాటి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే ఇబ్బందులను ఎదుర్కొనే వారు. వర్షాకాలంలో ఈ వాగు దాటుకుంటూ వెళ్లిన పలువురు కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటనలు సైతం ఉన్నాయి. పాకాల వాగుపై వంతెన నిర్మించాలని రైతులు, గ్రామస్తులు అనేక పోరాటాలు సైతం చేపట్టారు. చెక్ డ్యాం, వంతెన, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్న విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల రైతులు, గ్రామస్తులు, హర్షం వ్యక్తం చేశారు.
పాకాల వాగుపై చెక్‌డ్యాం,
వంతెన, రోడ్డు మంజూరు
రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన
రాష్ట్ర ప్రభుత్వం
త్వరలో పనులు ప్రారంభించనున్న
కాంట్రాక్టర్