వనపర్తి: ప్రజావాణిలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్‌ఓ సూర్యప్రకాశ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే.. సంబంధిత శాఖకు లేఖ రాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయడం లేదో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి తప్ప.. తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవద్దని తెలిపారు. ప్రజావాణిలో 59 దరఖాస్తులు అందినట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.


