వనపర్తిటౌన్: రాష్ట్ర ఆడపడుచుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పెబ్బేర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయంలో కట్టు, బొట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇచ్చే చీర ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. అన్నిరంగాల్లో ముందుండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గత పాలకులు చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిప్పులు చెరిగారు. కార్యక్రమంలో పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ పాల్గొన్నారు.
గోదాం నిర్మాణానికి శంకుస్థాపన..
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గోదాం నిర్మాణం పూర్తయితే ధాన్యం నిల్వ ఇబ్బందులు తొలగి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు కొండన్న, రాములు, బాలరాజు, గ్రామ ప్రజలు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


