వనపర్తి టౌన్: చదరంగం క్రీడలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. ఎల్.మురళీధర్ తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7న స్విస్ లీగ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రజా వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదరంగం క్రీడ మేధస్సును పెంచడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందిస్తుందని, అందుకే విద్యార్థుల్లో ఈ క్రీడపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అండర్–9, 11, 13 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించడంతో పాటు ఆయా విభాగాల్లో ప్రఽథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు వెండి పతకాలు అందిస్తామన్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో కొనసాగే పోటీల్లో ఆసక్తి గల విద్యార్థులు అత్యధికంగా పాల్గొని రాష్ట్రస్థాయి జట్టులో పాలమూరు ఖ్యాతిని చాటేలా సత్తా చాటాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. చెస్ పోటీలకు హాజరయ్యే బాల బాలికలకు భోజన వసతి కల్పిస్తామని, ఆసక్తిగల విద్యార్థులు 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏ క్రీడ పోటీలు జరిగినా పాలమూరు ప్రాతినిథ్యం ఉంటుందని, చెస్ పోటీల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేందుకు వనపర్తి చెస్ అసోసియేషన్ ధృఢ నిశ్చయంతో పని చేస్తుందన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ట్రెజరర్ టీపీ కృష్ణయ్య, సంయుక్త కార్యదర్శి రాములు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.


