ప్రజల భద్రతలో రాజీ లేదు | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రతలో రాజీ లేదు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

కేసుల దర్యాప్తులో ప్రమాణాలు

పాటించాలి

సైబర్‌ మోసాలు,

బాల్య వివాహలపై అవగాహన కార్యక్రమాలు

ఎస్పీ డి.సునీతారెడ్డి

సమీక్షలో పాల్గొన్న పోలీసు అధికారులు

వనపర్తి: ప్రజల విశ్వాసమే పోలీసుశాఖకు అతిపెద్ద బలం.. ప్రతి అధికారి ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించాలి.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, సైబర్‌ మోసాల నియంత్రణ, గ్రామస్థాయిలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి పోలీసు అధికారి బాధ్యతని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్టేషన్ల ఎస్‌ఐలతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రతి ఎస్‌ఐ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, గ్రామ పోలీసు అధికారులు తమకు అప్పగించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ఉండి ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్స్‌, సస్పెక్ట్‌ల కదలికలపై నిఘా ఉంచాలని, బూకోర్ట్‌, నైట్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌లు వినియోగించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించాలని సూచించారు. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని.. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్‌, డిజిటల్‌ అరెస్టులు, పోలీసుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని ప్రజలకు తెలియజేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరిస్తూ.. ప్రతి గ్రామం, వీధి, పరిశ్రమలు, పవిత్ర స్థలాల్లో ఏర్పాటు చేయించాలని సూచించారు. డయల్‌ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని, పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహిస్తూ రాత్రిళ్లు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్లలోని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని.. ప్రతి రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని, నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పని చేయాలన్నారు. సమీక్షలో అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, వనపర్తి సీఐ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూర్‌ సీఐ శివకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement