వనపర్తి: బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ సమాజంలోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్నేహ (కిషోర బాలికలు) సంఘాల సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బాలికలు ప్రధాని, స్పీకర్, ఎంపీల పాత్రలు పోషిస్తూ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కిషోర బాలికలతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని, బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహించడం మంచి సాధనగా అభివర్ణించారు. సమావేశంలో విద్యార్థినులు మహిళల్లో రక్తహీనత, సమాజంలో జరుగుతున్న పలు సమస్యలపై ప్రశ్నలు అడగడం బాగుందని కొనియాడారు. బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు వాటిపై గళం వినిపించాలని, ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మూడేళ్లలో 60 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలికలకు విద్యనే అత్యంత ప్రాధాన్యం కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలకు అనేక సవాళ్లు ఉన్నాయని.. వాటిని అవగాహనతో అధిగమించాలని కోరారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించేతత్వం అలవాటు చేసుకోవాలని, ఏ రంగంలో ఉన్నా ఉత్తమ స్థానాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి కొనుగోళ్లకు సంబంధించిన కమీషన్ చెక్కులు, ఎఫ్‌పీఓ సంఘాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా బాలికల సంరక్షణకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఓ రాణి, డీఐఓ జ్యోతి, డీడబ్ల్యూఓ సుధారాణి, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీఐఈఓ నరేంద్ర, పలువురు అధికారులు, స్నేహ సంఘాల బాలికలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న
స్నేహ సంఘాల సభ్యులు


