వనపర్తిటౌన్: పొగాకు వినియోగంతో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని.. వినియోగదారుడికంటే కుటుంబమే అధిక భారం మోయాల్సి వస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ ఒకేషనల్ కళాశాల భవనం ఎదుట దినసరి కూలీలకు పొగాకుతో కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ.. ఇంటి పెద్ద పొగాకుకు బానిసై అనారోగ్యం బారినపడితే ఇంట్లో వాళ్లు బతికుండగానే నరకం చూడాల్సి వస్తోందని తెలిపారు. కొద్ది నిమిషాల ఆనందం కోసం తాగే పొగాకుతో కుటుంబాలు రోడ్డున పడుతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆర్థిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. డా. రామచందర్‌రావు మాట్లాడుతూ.. మత్తుకు బానిసైన వ్యక్తులు ప్రభుత్వ ఆస్పత్రిలోని డి అడిక్షన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ పొంది భవిష్యత్‌ను సుఖమయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కళాజాత సువర్ణ బృందం తమ ఆటపాటలతో ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపర్చారు. అనంతరం దినసరి కూలీలతో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, డా. రియాశ్రీ, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, డా. శ్రీనివాస్, జూనియర్ వైద్యుడు డా. శశాంక్, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, అనిల్, లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ పదిలో
రాష్ట్రంలోనే ప్రథమం
వనపర్తిటౌన్: ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఓపెన్ పదిలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో, ఓపెన్ ఇంటర్ ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ఓపెన్ పదిలో 391 మందికిగాను 370 మంది పాసై 94.63 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఓపెన్ ఇంటర్‌లో 723 మందికిగాను 612 మంది పాసయ్యారని.. 80.21 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా తమ చదువు పూర్తి చేయాలని సూచించారు.


