పకడ్బందీగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియ

May 30 2026 12:29 AM | Updated on May 30 2026 12:29 AM

వనపర్తి: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా జూన్‌ 25 నుంచి ప్రారంభమయ్యే ఎన్యూమరేషనన్‌ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ షెడ్యూల్‌, నిర్వహణపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో కలెక్టరేట్‌ కాన్ఫరెనన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ సూపర్‌వైజర్లతో మాట్లాడుతూ.. మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సూపర్‌వైజర్‌ తమ పరిధిలోని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలి

వనపర్తిటౌన్‌: ఖాళీగా ఉన్న 600పైగా ఎంఈఓ పోస్టులు, 80 డిప్యూటీ ఈఓ కేడర్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల హెల్త్‌స్కీమ్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు కొత్తగా ఉమ్మడి సర్వీస్‌ నిబంధనలు రూపొందించాలన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని కోరారు. మోడల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సైతం హెల్త్‌కార్డు వర్తింపజేసి మినిమం బేసిక్‌ పే, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్‌ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సంఘం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా నర్సింహనాయుడును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గజేందర్‌, ఆర్థిక కార్యదర్శి సభ్యుడు అలీ తదితరులు పాల్గొన్నారు.

జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. డెడ్‌ స్టోరేజీ లెవెల్‌లో ఉన్న జూరాల నీటిమట్టం స్థానికంగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్‌ఫ్లోలు రావడంతో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పినట్లయింది.

పీయూలో నలుగురికి ప్రొఫెసర్లుగా పదోన్నతి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో పలు డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లుగా పదో న్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. 15 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్‌కు పదోన్నతులు కల్పించారు. ఇందులో మైక్రోబయోలజీ డిపార్ట్‌మెంట్‌లో మధుసూదన్‌రెడ్డి, కిషోర్‌, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో చంద్రకిరణ్‌, నూర్జహాన్‌ ఉన్నారు. కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌కు అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement