వనపర్తిటౌన్: త్వరలో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కనిపించకుండా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ చెక్కులు, రెండోవిడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని.. మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటి వరకు రూ.30.29 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆరోగ్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆరువేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. త్వరలో వనపర్తి మహిళలకు పెట్రోల్‌బంక్ మంజూరు కాబోతుందని, ప్లాట్లు లేని పేదలకు వెయ్యి ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. మహిళలు సూపర్‌మార్కెట్, రైస్‌మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లాలో ఇప్పటి వరకు రూ.83.76 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, మొదటి విడతలో మహిళలకు ఉచితంగా 12,669 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తే.. మలి విడతలో 15 వేల చీరలు వచ్చినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. మహిళల చేతుల్లో సంసారం ఉంటేనే కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సంఘంలో ఉన్న మహిళ ప్రమాదవశాత్తు చనిపోతే తీసుకున్న రుణం మొత్తం మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వమే బీమా చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, బస్సులు, గోదాములు అన్ని మహిళలకే కేటాయిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మహిళా సంఘాల సభ్యులకు రూ.3.40 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


