తరుగు పేరిట కోత విధిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

తరుగు పేరిట కోత విధిస్తే చర్యలు

May 30 2026 12:29 AM | Updated on May 30 2026 12:29 AM

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి

జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్‌/వీపనగండ్ల: తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోత విధించే రైస్‌మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మండలంలోని కేతేపల్లిలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శుక్రవారం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. మార్కెట్‌లో ఉన్న సమస్యలు, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని.. తూకం చేసిన ధాన్యం తరలింపునకు లారీల సంఖ్య పెంచాలని సూచించారు. అలాగే మిల్లులకు చేరిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేయించాలని, కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే సమీపంలో ఉన్న మైరూన్‌ రైస్‌మిల్లును సందర్శించి ధాన్యం అన్‌లోడ్‌, నిల్వలపై ఆరా తీశారు. మిల్లుల వద్ద లారీలు ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దని, అవసరమైతే స్థానికంగా హమాలీలను నియమించుకొని వేగంగా అన్‌లోడ్‌ చేయించాలని సూచించారు. హమాలీల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

ఎఫ్‌సీఐ ఇబ్బందులు మంత్రి దృష్టికి..

రైతులు తాలు, ధుమ్ము ఉన్న ధాన్యం తీసుకురావడంతో బియ్యంలో మెరికలు, నలుపుగా వస్తుండటంతో ఎఫ్‌సీఐ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మిల్లు యజమాని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శుభ్రం చేసిన ధాన్యం తీసుకొస్తే ఇబ్బందులు ఉండవని తెలిపారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్దన్‌సాగర్‌, తహసీల్దార్‌ కార్తీక్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు రవికుమార్‌, పుల్లారావు, భాస్కర్‌యాదవ్‌, రాముయాదవ్‌, పౌరసరఫరాల అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement