వనపర్తి రూరల్: ప్రతి మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు వినియోగించడం గొప్ప మానవత్వమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో బూజుల సోమమ్మ, రంగారెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో వారి కుమారులు ఖగేంధర్‌రెడ్డి, హేమసుందర్‌రెడ్డి, భువనేశ్వర్‌డ్డి ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో ఉంటూ స్వగ్రామంలో తల్లిదండ్రుల పేరిట కంటి వైద్య శిబిరం నిర్వహించిన బీఎస్‌ఆర్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులను ఆయన అభినందించారు. సమాజంలో ప్రతి మనిషి సంపాదించిన దాంట్లో కొంత పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. తాను కూడా తన స్వగ్రామం మంగంపల్లిలో 20 ఏళ్లు సర్పంచ్‌గా పని చేశానని, ఆ గ్రామంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తనవంతుగా రూ.21 వేలతో పాటు పుస్తే, మెట్టెలను అందిస్తూ వస్తున్నానని.. ఎంపీపీ అయిన తర్వాత మండలస్థాయిలో పేద కుటుంబాల్లో మృతిచెందిన వారి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలు మేఘన్న అభయాస్తం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి, పేదలకు తనవంతు సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలబడే మంచి మనసున్న వారందరికి సమాజం రుణపడి ఉంటుదన్నారు. కన్నవారిని, జన్మనిచ్చిన గ్రామాన్ని ఎప్పటికీ మరవొద్దని.. తమకు తోచిన సాయాన్ని అందిస్తూ రావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్టా నాగేష్, పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, బీఎస్‌ఆర్ సొసైటీ సభ్యులు, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్‌రెడ్డి, ఉప సర్పంచ్ బొల్లి రాజు, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు.


