వనపర్తి: గోల్కొండ పత్రిక సంపాదకులు, వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. సురవరం 130వ జయంతి సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి, పక్కన ఉన్న పార్క్‌లోని సురవరం కాంస్య విగ్రహానికి శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సమాజానికి చేసిన సేవలు.. మార్పు, సంస్కరణల కోసం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘రైతుల సంక్షేమాన్ని
విస్మరించిన ప్రభుత్వం’
పాన్‌గల్/వీపనగండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం పాన్‌గల్ మండలం చింతకుంట, వీపనగండ్ల మండలం కల్వరాల వరి కొనుగోలు కేంద్రాలను శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటినా తూకం చేయడం లేదని పలువురు రైతులు వివరించగా.. వెంటనే ఆయన కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం బస్తాలను తరలించేందుకు జాప్యం లేకుండా లారీలను పంపాలని సూచించారు. సమస్యలను రెండ్రోజుల్లో పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, సేకరించిన ధాన్యం బస్తాల తరలింపులో జాప్యంతో అకాల వర్షాలకు తడిసి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా తూకం చేయడంలో తీవ్ర జాప్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణం పాఠం చెబుతారన్నారు. నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు మోసపోతే గోస పడుతాం అనే మాట వంద శాతం నిజమైందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌నాయక్, రవికుమార్, వెంకటయ్యనాయుడు, గో పాల్‌రెడ్డి, తిలకేశ్వర్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


