తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

వనపర్తి రూరల్‌: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. గురువారం ఆయన మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించి ధాన్యం నిల్వ కోసం అదనంగా ఏర్పాటు చేసిన గోదాంను రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేసి అక్కడ కొనసాగుతున్న అన్‌లోడింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల్లో అకాల వర్షాలకు 600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడవగా.. వాటిని బాయిల్డ్‌ మిల్లుకు తరలించామని తెలిపారు. జిల్లాలో రెండేళ్లుగా రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వస్తున్నాయని.. గతంలో సీజన్‌కు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి ఉండగా, ప్రస్తుతం 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు చేరిందన్నారు. ధాన్యం నిల్వకు గోదాముల్లో స్థలం కొరత ఏర్పడుతోందని తెలిపారు. ఆయన వెంట మార్కెట్‌యార్డు చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌, డీఆర్డీఓ ఉమాదేవి, పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు తదితర అధికారులు ఉన్నారు.

రికార్డుస్థాయిలో వరి దిగుబడి..

వనపర్తి: జిల్లాలో రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వచ్చినందున నిల్వ కోసం అదనపు స్థలం అవసరం అవుతోందని.. రైస్‌మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి అన్‌లోడ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. మిల్లర్ల వారీగా గోదాములలో ఖాళీ స్థలాలపై చర్చించి అదనంగా ధాన్యం బస్తాల కేటాయింపుపై సూచనలు చేశారు. నిల్వ కోసం అందుకు తగిన అద్దె చెల్లిస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్‌, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement