జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్ వరి ధాన్యం సుమారు 3.70 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయానికి వస్తుందని అధికారులు 400పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించేందుకు తొమ్మిది రూట్లుగా విభజించి ఒక్కో రూట్‌కు 40 లారీల చొప్పున 360 లారీలు అందుబాటులో ఉంచాలని టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ వారు సకాలంలో సరిపడా వాహనాలు సమకూర్చకపోవడంతో ధాన్యం కేంద్రాల్లో పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సరిపడా వాహనాలు సమకూర్చాలని జిల్లా అఽధికారులు రవాణా కాంట్రాక్టర్లకు చెప్పినా స్పందన లేకపోవడంతో రైతులే ట్రాక్టర్లలో తరలించుకుంటే అద్దె చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో ముందుకొచ్చారు. కానీ అద్దెకూడా వెంటనే చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. సంతోకర విషయం ఏమిటంటే గతంతో పోలిస్తే ధాన్యం విక్రయించిన డబ్బులు మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లు రసీదు ఇచ్చిన కొన్ని గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం విశేషం.


