వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న గిరిజన భవనంలో అధికారులు వరి ధాన్యం నిల్వ చేస్తున్నారు. గురువారం గ్రామంలోని రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి దించుకోవాలని అధికారులను కోరారు. తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్ మిల్లుకు తీసుకెళ్లాలని సూచించగా.. ఇక్కడే దించుకోవాలంటూ రైతులు పట్టుబట్టారు. ఎస్‌ఐ హృశికేష్ అక్కడికి చేరుకొని సింగిల్‌విండో చైర్మన్ రఘువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య కలిసి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం వేరే మిల్లుకు తరలించాలని, తడవని ధాన్యం ఇక్కడే దించుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. కాగా.. లారీల్లోని సంచులు దించుతుండగా మొలకెత్తిన సంచులు కనిపించడంతో మళ్లీ గొడవ మొదలైంది. లారీలోని తడిసిన ధాన్యం దించుకుంటారు.. తమ ధాన్యం వేరే మిల్లుకు ఎందుకు తీసుకెళ్లాలని అధికారులను ప్రశ్నించారు. ఎంతచెప్పినా వినకపోవడంతో అధికారులు గోదాంకు తాళం వేసి వెళ్లిపోయారు. చివరకు పౌరసరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్‌మిల్లుకు తరలించేలా ఒప్పించారు.


