నేరుగా సీఎం రంగంలోకి..
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు
తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వెనుకబాటు ప్రధానాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికలు పాలమూరు ప్రాజెక్ట్ చుట్టే నడిచాయి. తొలి పర్యాయంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగా.. పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్ట్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. నీటి తరలింపునకు సంబంధించి జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చిన సోర్సుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య భిన్న వాదనలు నడిచాయి. ఎట్టకేలకు 2015 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. తొలి విడతలో ఐదు రిజర్వాయర్ల (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) పనులు మొదలుపెట్టారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద మొదటి పంప్‌ను ప్రారంభించారు. అయితే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 16 కిలోమీటర్ల టన్నెల్, 8.3 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇందులో టన్నెల్ పూర్తి కాగా.. 2.5 కి.మీ. మేర ఓపెన్ కెనాల్ పెండింగ్‌లో ఉంది. ఇక్కడ దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు రిజర్వాయర్లకు నీటిని తరలించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ రెండున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయడం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చివరలో మిగిలిన పనుల పూర్తిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని గత జనవరిలో మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ భవన్‌లో మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్‌ఎల్‌ఐ పనులు పూర్తిచేయించేందుకు బీఆర్‌ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై జూన్‌లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తొలి రోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మధ్యలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొనేలా.. చివరకు ముగింపు రోజున కేసీఆర్ పాల్గొనేలా భారీ బహిరంగసభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. మరోవైపు పాలమూరు ప్రాజెక్ట్ అస్త్రంగా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి.
పీఆర్‌ఎల్‌ఐతో పాటు జిల్లాలోనిఎండింగ్ ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ నేతలు వినతిపత్రాలు ఇచ్చారు. పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్ట్‌కు తరలించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని.. తాము పోరాటం చేస్తామని.. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా జేఏసీ నేతలు ఆయనను కలిసి వినతిపత్రం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే అవకాశం ఉండగా.. రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే
డిమాండ్‌తో బీఆర్‌ఎస్ పోరు
వచ్చే నెలలో పాదయాత్ర,
బహిరంగ సభకు సన్నాహాలు
ఇదే అంశంతో టీఆర్‌ఎస్
అధ్యక్షురాలు కవిత ఉద్యమ బాట
2027 డిసెంబర్‌లోపు
పూర్తి చేసేలా కాంగ్రెస్ కార్యాచరణ
2 రోజుల పాటు ప్రాజెక్ట్‌ల
సందర్శనకు సీఎం సమాయత్తం
పొలిటికల్ డ్రామాలకే పరిమితమని బీజేపీ విమర్శలు
బీఆర్‌ఎస్ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ సైతం పోటాపోటీగా అడుగులు వేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలో మిగిలిన పెండింగ్ ప్రాజెక్ట్‌లపై ఇటీవల హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ వేర్వేరుగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని.. గ్రీన్‌చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పాలమూరులోని అన్ని ప్రాజెక్ట్‌ల పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ పెట్టినట్లు తెలిసింది. అంతేకాదు.. సీఎం స్వయంగా ఈ నెల 30, 31న లేదంటే వచ్చే నెల మూడు, నాలుగో తేదీన రెండు రోజుల పాటు పాలమూరు–రంగారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్ట్‌ల సందర్శనకు సమాయతమైనట్లు సమాచారం. పెండింగ్ ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలను వేగిరం చేయడంతో పాటు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్‌లకు ఏ విధంగా అన్యాయం చేసిందనే దానిపై ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.


