అప్పులుంటే.. చంపేస్తావా! | - | Sakshi
Sakshi News home page

అప్పులుంటే.. చంపేస్తావా!

May 28 2026 3:10 AM | Updated on May 28 2026 3:10 AM

డోకూరులో విషాదఛాయలు

పరిశీలించిన

డీఎస్పీ గిరిబాబు

నీ మనసు ఇంత కఠినమా నాన్నా

వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్‌ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్‌(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బాబు 10.. పాప 8

నర్సింహులు కుమారుడు నిహాల్‌ దేవరకద్రలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి పూర్తిచేయగా.. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి చదవాల్సి ఉంది. అలాగే పాప సాహితీశ్రీ అదే పాఠశాలలో 7 తరగతి పూర్తిచేయగా.. ఈసారి 8వ తరగతి చదవాల్సి ఉందని బంధువులు తెలిపారు.

నర్సింహులు, ఎల్లమ్మ, నిహాల్‌, సాహితీశ్రీ (ఫైల్‌)

దేవరకద్ర: నర్సింహులు కుటుంబం మరణంతో మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో విషాదం అలుముకుంది. ఐదు దశాబ్దాల క్రితం గద్వాల నుంచి వలస వచ్చిన నర్సింహులు, తన సోదరులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పండ్ల తోటలను లీజుకు తీసుకుని వచ్చిన లాభాలతో ఆ కుటుంబాలు గడిపేవారు. కాలక్రమంలో పండ్ల తోటలకు నష్టం రావడంతో నర్సింహులు అప్పులు పేరుకుపోయాయి. గత జూన్‌లో దాదాపు రూ.కోటి బాకీ పడ్డాడని డోకూరు గ్రామస్తులు నర్సింహులుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా చేసిన అప్పులు తీర్చలేక భార్యాబిడ్డలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామంలోని వారి కుటుంబ సభ్యులు వాపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం డోకూరుకే తెస్తుండడంతో నర్సింహులు ఇంటి వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

నమ్మివచ్చిన భార్య, జన్మనిచ్చిన పిల్లల్ని కడతేర్చిన తండ్రి

కాళ్లు చేతులు కట్టి నీటిసంపులో పడేసి.. తానూ ఉరేసుకుని

బలవన్మరణం

తాను చేసిన అప్పులు

వారినేం చేస్తాయోననే భయంతో ఘాతుకం

కౌలు రైతు కుటుంబాన్ని

చిదిమేసిన అప్పులు

Advertisement
 
Advertisement
Advertisement