కొత్తకోట రూరల్: వరి ధాన్యం తరలింపునకు అదనంగా లారీలను సమకూర్చాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన పెద్దమందడి మండలంలోని సప్తగిరి, శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులను తనిఖీ చేసి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. ఇందుకోసం మరింత మంది హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వెంటనే అన్‌లోడ్ చేయాలని, గోదాముల్లో ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేయాలన్నారు. శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ వద్ద యజమానితో మాట్లాడిన కలెక్టర్ అదనపు నిల్వ స్థలాన్ని తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు తమ ప్రైవేట్ వాహనాలను కూడా వినియోగించాలని, వరి ధాన్యం నిల్వలకు అదనపు స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఐకేపీ కొనుగోలు కేంద్రం సందర్శన..
పెద్దమందడిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు ఎన్ని వరి సంచులు తరలించారు.. ఇంకా ఎన్ని సంచులు కొనుగోలు చేయాల్సి ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌ను కలిసి లారీల కొరత తీవ్రంగా ఉందని.. అదనపు లారీలు సమకూర్చాలని కోరారు. ప్రస్తుతం రవాణా ఖర్చులను తామే భరిస్తున్నామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ రవాణా కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే మరిన్ని లారీలను కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులకు రవాణా ఖర్చులను కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసి ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ పాండునాయక్, ఇతర అధికారులు ఉన్నారు.


