వనపర్తి: జిల్లాలో అధికసంఖ్యలో సభ్యత్వ నమోదు చేపట్టి రెడ్‌క్రాస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సభ్యత్వ నమోదు నిర్వహించగా.. కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. సమాజ సేవలో రెడ్‌క్రాస్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. కార్యక్రమానికి జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డా. ప్రియాంక నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్ రాజేంద్రకుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహిళా ప్రగతి..
తెలంగాణ ఉన్నతి
వనపర్తి: మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన ‘మహిళా ప్రగతి – తెలంగాణ ఉన్నతి’ అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తూడి మేఘారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదిగి కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు గ్రామీణాభివృద్ధికి వెన్నముకగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. డీపీఎంలు నాగమల్లిక, కె.ప్రభాకర్, ఆనంద్ తదితరులు మహిళా సంఘాల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మహిళా శక్తిని ప్రతిబింబించాయి. డీఆర్డీఓ ఉమాదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్‌ఎల్‌ఎన్ మాధవి, అదనపు డీఆర్డీఓ సరోజ, జెడ్‌ఎంఎస్ అధ్యక్షురాలు ఇందిర, జిల్లాలోని 7 మండలాల ఎంఎంఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.


