● పారామెడికల్ కళాశాలల్లో అడ్డగోలుగా అడ్మిషన్లు
● అక్రమార్జనే ధ్యేయంగా అనుమతి లేని కోర్సుల్లోనూ ప్రవేశాలు
● ఇక్కడ చేరికలు..
హైదరాబాద్‌లో పరీక్షలు
● ఉమ్మడి జిల్లాలో
8 అనుమతులు లేని కళాశాలలు
● అప్రమత్తంగా లేకపోతే
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఇక్కడ చేరిక.. అక్కడ పరీక్ష
జిల్లాకేంద్రంలోని పలు పారామెడికల్ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. వీటిలో ఎంపీహెచ్‌డబ్ల్యూ, ల్యాబ్‌టెక్నీషియన్ వంటి ఇంటర్మీడియట్ స్థాయి చిన్నపాటి కోర్సులు నిర్వహించే అవకాశం ఉంది. కానీ, కొన్ని పారామెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ ఎమ్మెల్టీ వంటి కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుని.. హైదరాబాద్‌లో అనుమతులున్న కళాశాలలకు పరీక్ష ఫీజు, ప్రాక్టికల్స్ చేయించడం, సర్టిఫికెట్ ఇప్పించడం వంటివి చేయిస్తున్నారు. చివరికి నామమాత్రంగా విద్యార్థులకు కళాశాలలో తరగతులు నిర్వహించి పరీక్షలు అన్నీ కూడా హైదరాబాద్‌లోనే రాయిస్తున్నారు. ఇందుకు రెగ్యులర్ కళాశాలలో వసూలు చేస్తున్న మాదిరిగా రూ.వేలల్లో ఫీజులు, రికార్డులు, ప్రాక్టికల్స్ వంటి వాటికి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా కళాశాలల్లో జరుగుతున్న తతంగం అంతా ఇంటర్మీడియట్ అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
● పాలమూరు నగరంలోని ఓ పారామెడికల్ కళాశాల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి తమ కళాశాలలో బీఎస్సీ ఎమ్మెల్టీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఇతర డిగ్రీ స్థాయి పారామెడికల్ కోర్సులు ఉన్నాయని, ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మీ విద్యార్థినిని చేర్పించాలని కోరారు. దీంతో సదరు బాలిక తల్లి జిల్లాకేంద్రంలోని తమ బంధువులకు ఫోన్ చేసి ఆ కళాశాలలో విద్యార్థినిని చేర్పిస్తున్నట్లు తెలిపింది. అయితే బంధువులు సదరు పారామెడికల్ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో అవాకై ్కంది.
● పాలమూరు నగరంలోని న్యూటౌన్ వద్ద ఉన్న ఓ పారామెడికల్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసిన కొడంగల్‌కు చెందిన ఓ విద్యార్థికి ఫోన్ చేసి తమ వద్ద జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులు ఉన్నాయని వాటిలో చేరాలని చెప్పగా విద్యార్థి ఫీజు మాట్లాడుకుని వచ్చారు. అనంతరం ఫీజు తగ్గించేందుకు స్థానికంగా ఉండే మీడియాలో పనిచేసే తన బంధువును తీసుకెళ్లగా.. తమ వద్ద ఎలాంటి కోర్సులు లేవని కళాశాల సిబ్బంది బుకాయించడంతో ఖంగుతినడం సదరు విద్యార్థి వంతైంది.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అక్రమార్జనే ధ్యేయంగా.. ఉమ్మడి జిల్లాలోని కొన్ని పారామెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ ఎమ్మెల్టీతోపాటు ఇతర మెడికల్ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. పలు ప్రభుత్వ కళాశాలల నుంచి విద్యార్థుల వివరాలు సేకరించి తమ వద్ద వివిధ కోర్సులు ఉన్నాయని నమ్మబలుకుతూ.. అడ్మిషన్లు తీసుకోవాలని తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది నుంచి విద్యార్థుల వివరాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం పారామెడికల్ కళాశాలల్లో ఎస్సెస్సీ తర్వాత కేవలం ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎమ్మెల్టీ, ఎక్స్‌రే టెక్నీషియన్ వంటి కోర్సులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కళాశాలల్లో నిర్వహించాల్సిన కోర్సులను పారామెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించడం విస్మయానికి గురిచేస్తుంది. అన్నీ తెలిసినా.. ఇంటర్మీడియట్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో పదుల సంఖ్యలో అడ్మిషన్లు అయ్యాయి. జిల్లాకేంద్రంలోని పలు కళాశాలల్లో ఈ వ్యవహారం పెద్దఎత్తున నడుస్తుంది. రికార్డుల్లో ఎక్కువ మంది విద్యార్థుల పేర్లు లేకుండా.. ఎవరికి అనుమానం రాకుండా వీటిని పలు కళాశాలలు నిర్వహిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా పరిధిలో..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 74 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని కళాశాలలు రెన్యువల్, ఫైర్‌సేఫ్టీ వంటి ఇబ్బందుల కారణంగా పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రస్తుతం అడ్మిషన్లు తీసుకుంటున్నారు. గతేడాది పూర్తిస్థాయిలో అనుమతులు లేని ఓ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులను ఎంవీఎస్ కళాశాల నుంచి పరీక్షలు రాయించారు. ప్రతి సంవత్సరం జిల్లాలోని ఏదో ఒక కళాశాలకు అనుమతులు రాకపోవడం, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల నుంచి పరీక్షలు రాయించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యార్థులు త్రీవ ఇబ్బందుల పాలవుతున్నారు. సంబంధిత అధికారులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని గుర్తిస్తే అడ్మిషన్లు తీసుకోకుండా అడ్డుకోవచ్చని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే విద్యా శాఖ అధికారులు మాత్రం వచ్చేనెలలో తనిఖీలు చేపడుతామని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో విద్యార్థులు అప్రమత్తంగా లేకపోతే చివరికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో అనుమతులు లేకుండా, సంబంధం లేని కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్న కళాశాలలను గుర్తించి తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ఈ నెల 31 తర్వాత ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులు కళాశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలి. – రమణి, డీఐఈఓ


