పెంచిన ఇంధన ధరలు తగ్గించే వరకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

పెంచిన ఇంధన ధరలు తగ్గించే వరకు ఉద్యమం

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

వనపర్తి: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్‌పార్టీ ప్రజల పక్షాన ఉద్యమం కొనసాగిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస శ్రేణులు ఎద్దులబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్‌పార్టీ సమర్థవంతంగా పోషిస్తోందని, ధరల పెంపు దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నామని చెప్పడం సరైంది కాదన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిన నాయకులు రాజకీయ ప్రయోజనాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలను పట్టించుకోకుండా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తూ కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తోందని ఆరోపించారు. ఇలాగే ధరలు పెరిగితే భవిష్యత్‌లో ఎద్దుల బండ్లు, గుర్రపుబండ్లు, సైకిళ్ల వినియోగం పెరిగే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డి, తిరుపతయ్య, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, కౌన్సిలర్లు ధనలక్ష్మి, మహేశ్వరి, విజయలక్ష్మి, పార్టీ అధికార ప్రతినిధులు శరవంద, కోళ్ల వెంకటేష్‌, ఆదిత్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement