వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరుకునన్న వరి ధాన్యాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా దించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం శ్రీరంగాపురం మండల కేంద్రంతో పాటు కంభాళాపురం, పెబ్బేరు పరిసరాలు, రంగాపూర్‌లోని రైస్‌మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్‌లోడింగ్, అదనపు ధాన్యం నిల్వలను పరిశీలించారు. మిల్లుల ఆవరణలో గోదాములు, స్థలాలను పరిశీలించి రాబోయే రోజుల్లో ధాన్యం నిల్వకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా హమాలీల సంఖ్య పెంచి ధాన్యాన్ని త్వరగా దించుకోవాలన్నారు. తూకంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించాలని, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట తహసీల్దార్లు వరలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, ఆర్‌ఐలు రాఘవేందరావు, సింగిల్‌విండో సిబ్బంది, రైస్‌మిల్లర్లు ఉన్నారు.


