ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తం

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

వనపర్తి: అధికార, పాలకవర్గం నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ధాన్యం విక్రయానికి రైతులు అరిగోసపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం ఆయన స్థానిక నాయకులతో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తూకం చేసిన ధాన్యం సకాలంలో తరలించి ఉంటే తడిసిపోయేదా అని ప్రశ్నించారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటల సాగు సమయంలో యూరియా కోసం రైతులు వరుసలో నిలబడాల్సి వస్తోందన్నారు. జిల్లాలో వరి కొనుగోళ్లు ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు ఒక్క లారీ కూడా వెళ్లని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక లేకనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాహనాలు లేని వారికి, డిఫాల్టర్‌ మిల్లర్లకు అధికారులు ధాన్యం తరలింపు బాద్యతలు అప్పగించడంతో కొనుగోలు కేంద్రాల నుంచి సకాలంలో ధాన్యం మిల్లులకు వెళ్లడం లేదని, చేసేది లేక రైతులు సొంత ట్రాక్టర్లలో తూకం చేసిన ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి సుమారు రూ.120 కోట్ల మేర బకాయి ఉన్న శ్రీరంగాపూర్‌కు చెందిన ఓ మిల్లర్‌కు అధికారులు రవాణా బాధ్యతలు ఎలా అప్పగించాలని ప్రశ్నించారు.

కొన్ని మిల్లులకు 90 శాతం ధాన్యం కేటాయింపులు..

ప్రభుత్వ అనుబంధంతో రైస్‌మిల్లులు నడిపిస్తున్న కొందరికి ప్రతి సీజన్‌లో 90 శాతం ధాన్యం కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని.. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటే కేటాయింపుల్లో కాంగ్రెస్‌ అనుబంధంగా ఉండే మిల్లర్లకు అగ్రభాగం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కొందరు రాజకీయ బ్రోకర్లు, మిల్లర్లు, అధికారులు కు మ్మకై ్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలు అందరికీ సమానంగా అమలు చేయా లని, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

శ్రీధర్‌ హత్య కేసు ఏమైంది..?

చిన్నంబావి మండలం బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్య కేసును రెండేళ్లు పూర్తయినా.. ఎందుకు ఛేదించడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పోలీసు అఽధికారులు మారుతున్నారే తప్ప విచారణ కొలిక్కి రావటం లేదని విమర్శించారు. సహచర మంత్రిని కాపాడేందుకు సీఎం ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. మాజీ మంత్రి వెంట బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌, నాయకులు లక్ష్మారెడ్డి, మాణిక్యం, నందిమళ్ల అశోక్‌, జోహెబ్‌, రాము తదితరులు ఉన్నారు.

అధికారులు, పాలకల నిర్లక్ష్యంతోనే రైతులకు అవస్థలు

Advertisement
 
Advertisement
Advertisement