అన్నదాత.. అరిగోస | - | Sakshi
Sakshi News home page

అన్నదాత.. అరిగోస

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

వనపర్తి రూరల్‌/కొత్తకోట రూరల్‌: జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులో సుమారు 20 వేల బస్తాల వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆదివారం ఉదయం తడిసిన ధాన్యాన్ని ఆరబోయలేక, తూకం చేసిన సంచులను నీటిలోంచి తీసి ఆరబెట్టలేక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం. ఏ రైతును పలుకరించినా మార్కెట్‌కు ధాన్యం తెచ్చి 60 రోజులు అవుతుందని.. కొనుగోలు పూర్తి కాలేదని చెప్పడం కనిపించింది. రోజు అధికారులు సందర్శించి కొనుగోలు చేయాలని చెబుతారేగాని.. ఎక్కడికి తరలించాలనే ముందుచూపు లేక తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసిన తర్వాత అధికారులు వచ్చి మార్కెట్‌యార్డులో ఉన్న షెడ్డులోకి తరలిస్తామని చెబుతున్నారు. ఇదే పని నాలుగు రోజుల ముందు చేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని అంటున్నారు.

● ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సింగిల్‌విండో, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. రోజు సాయంత్రం అయిందంటే చాలు ఈదురు గాలులు, పిడుగులు, అకాల వర్షాలకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం బస్తాలను వేగంగా గోదాంలకు తరలించాలని వేడుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

నీటిలోనే తూకం చేసిన వరి ధాన్యం బస్తాలు

Advertisement
 
Advertisement
Advertisement