తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

వనపర్తి రూరల్‌: రైతులు ఆందోళన చెందొద్దని.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిందని ఆదివారం రైతులు ఆందోళన చేస్తుండగా విషయం తెలుసుకున్న ఆయన అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్నిరైతులకు నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. వర్ష సూచన ఉన్నందున కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రభుత్వం రైతుల పక్షాన ఉటుందని.. కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, ఎస్‌ఐ హృశికేష్‌, సర్పంచ్‌ పుష్పలత, ఏపీఎం బుచ్చన్న, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష

కందనూలు: నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హేమంతకేశవ్‌ పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్‌ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

నేటి నుంచి డీఎడ్‌ పరీక్షలు

వనపర్తిటౌన్‌: జిల్లాలో డీఎడ్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘనీ, ఏసీజీఈ గణేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement