చేయూత.. పరిశీలన | - | Sakshi
Sakshi News home page

చేయూత.. పరిశీలన

May 24 2026 12:27 AM | Updated on May 24 2026 12:27 AM

కొనసాగుతున్న పింఛన్‌దారుల వివరాల నమోదు

మూడు నెలలకోసారి ముఖచిత్రాల నమోదు

జిల్లాలో 70 వేల పైచిలుకు లబ్ధిదారులు

పురపాలికల్లో వార్డు అధికారులు, గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు

చేయూత యాప్‌లో నమోదు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పింఛన్‌దారుల వివరాలను చేయూత యాప్‌లో నమోదు చేస్తున్నాం. ఈ విషయాన్ని ముందస్తుగానే పట్టణంలోని అన్ని వార్డుల్లో టాం టాం వేయించాం. నడవలేని, మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వార్డు అధికారులు వెళ్లి నమోదు చేసుకుంటున్నారు. నెలాఖరు నాటికి వివరాల నమోదు పూర్తిచేస్తాం.

– నూరుల్‌ నదీం,

పుర కమిషనర్‌, అమరచింత

ముందస్తు సమాచారం ఇస్తున్నాం..

చేయూత యాప్‌లో పింఛన్‌దారుల వివరాల నమోదు విషయాన్ని గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది ద్వారా ముందస్తుగా సమాచారం ఇస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరీష్‌ నమోదు చేసుకుంటున్నారు. వివరాలు నమోదు చేసుకోకపోతే వచ్చే నెల పింఛన్‌ రాదనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేస్తూ నమోదును వేగవంతంగా చేపడుతున్నాం.

– శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత

వచ్చే నెల 15 వరకు..

చేయూత పింఛన్‌ లబ్ధిదారుల వివరాలను చేయూత యాప్‌లో నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 15 వరకు నమోదు కార్యక్రమం కొనసాగనుంది. నమోదు ప్రక్రియ ఇకపై ప్రతి మూడు నెలలకు ఓ మారు ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలిసింది.

– ఉమాదేవీ, డీఆర్డీఓ

అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2 తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం నుంచి కొత్తగా చేయూత పింఛన్‌ మంజూరుకు శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రస్తుత లబ్ధిదారుల వివరాలతో పాటు వారి ఐరిష్‌ను నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టింది. జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు పుర కేంద్రాల్లో మూడురోజులుగా పింఛన్‌దారుల వివరాలను ప్రత్యేక చేయూత యాప్‌లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుడి ఆధార్‌ నంబర్‌తో పాటు అతని కళ్లు, ముఖం ఫొటో క్యాప్చర్‌ చేస్తూ యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు. సకాలంలో యాప్‌లో వివరాలు నమోదు చేసుకోకుంటే వారి పింఛన్‌ రద్దయ్యే అవకాశం ఉంది. కూలి పనులతో పాటు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వారిని వారి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి పిలిపించుకొని అధికారుల వద్ద వివరాలను నమోదు చేయిస్తున్నారు.

● జిల్లాలోని 255 గ్రామపంచాయతీలలో చేయూత నమోదు కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. జూన్‌ 15 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించడంతో ప్రతి లబ్ధిదారు తమ వివరాలతో పాటు అధికారులు అడిగిన సమాచారాన్ని అందిస్తున్నారు. జిల్లాలో చేయూత పింఛన్‌ పొందుతున్న వారి సంఖ్య 70 వేల పైచిలుకు ఉందని డీఆర్డీఓ అధికారులు వెల్లడిస్తున్నారు.

చాలా గ్రామాల్లో లబ్ధిదారులు చనిపోయినా.. అతడి పేరుపై కుటుంబ సభ్యులు నేటికీ బ్యాంకు, పోస్టాఫీసు ద్వారా పింఛన్‌ పొందుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత యాప్‌లో లబ్ధిదారుల నమోదుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అక్కడే ఐరిష్‌ నమోదు చేస్తుండటంతో ఇకపై మృతిచెందిన వారి పింఛన్లు నిలిచిపోవడం ఖాయమంటున్నారు. దీంతో అర్హత కలిగి నేటికి పింఛన్‌ తీసుకోలేని వారికి ఇది ఒక అవకాశంగా మారింది.

వృద్ధాప్య

27,195

ఒంటరి మహిళలు 2,521

బీడీ కార్మికులు 963

చేనేత

564

పెబ్బేరు 1,592

అమరచింత 2,020

డయాలసీస్‌

104

పైలేరియా

5

గీత కార్మికులు 389

ఆత్మకూర్‌ 1,237

మృతిచెందిన వారిని తొలగింపునకే..

Advertisement
 
Advertisement
Advertisement