ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

May 24 2026 12:27 AM | Updated on May 24 2026 12:27 AM

నేలకొరిగిన వృక్షాలు..

తెగిన విద్యుత్‌ తీగలు

స్తంభించిన రాకపోకలు

మదనాపురం/వనపర్తి రూరల్‌/కొత్తకోట రూరల్‌ /ఆత్మకూర్‌/అమరచింత/ పాన్‌గల్‌/ గోపాల్‌పేట/ ఖిల్లాఘనపురం: జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మదనాపురం – కొత్తకోట ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ తీగలు తెగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్‌, కొత్తకోట వైపు వెళ్లాల్సిన వందలాది వాహనాలు, బస్సులు, అత్యవసర అంబులెన్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్తకోటలో భారీ వేప చెట్లు, చెట్ల కొమ్మలు రోడ్డుకు పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలపై, రోడ్డుపై పడడంతో రాకపోకలు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. స్థానికులు గుమిగూడి ప్రధాన రహదారిపై చెట్లను తొలగించారు.

తడిసిన ధాన్యం..

వనపర్తి మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులో వరి ధాన్యం తడిసిపోయింది. టారాలిన్లు కప్పినా అడుగున వర్షపునీరు నిలిచి తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరంగాపురం, పెబ్బేరుతో పాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఽకొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈదురుగాలులకు చందాపూర్‌ రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి.

● అమరచింత–ఆత్మకూర్‌ మధ్యలో చెట్లు కూలి విద్యుత్‌ తీగలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్‌ గాంధీచౌక్‌లో వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.

● గోపాల్‌పేట మండలంలో పొలికెపాడు– తూడుకుర్తి, గోపాల్‌పేట – చాకల్‌పల్లి రహదారులపై చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి.

● పాన్‌గల్‌లో ప్రధాన రహదారిపై చెట్లు నెలకొరగగా.. నిరంజన్‌ ఇంటి పైకప్పు కూలిపడగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పినా అక్కడక్కడా తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

● ఖిల్లాఘనపురం మండలంలోని సోళీపురం నుంచి కోతులకుంట తండాకు వెళ్లే దారిలో 20 స్తంభాలు, నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయాయి. దీంతో తండాలో అంధకారం నెలకొంది. మామిడిమాడలో తెలుగు శేషమ్మకు చెందిన రేకుల ఇంటి కప్పు ఈదురు గాలులకు ఎగిరిపోయింది.

పిడుగు పాటుతో ఎద్దు మృతి..

కొత్తకోట మండలంలోని కనిమెట్టలో పిడుగు పాటుకు గురై రైతు బోయ కృష్ణయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. అదేవిధంగా కొత్తకోటలోని మాంసం మార్కెట్‌ సమీపంలో, పాత జూనియర్‌ కళాశాల సమీపంలోని ప్రధాన రోడ్డుపై భారీ వేపచెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

శంకరమ్మపేటలో పిడుగుపాటు

మదనాపురం మండలంలోని శంకరమ్మపేటలో బోయ సురేష్‌ ఇంటి ఎదుట ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement
 
Advertisement
Advertisement