వనపర్తి: ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. నైపుణ్యాలు పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా మే 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో జాబ్‌మేళా నిర్వహించగా.. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరై వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 17 మందికి నియామక పత్రాలు అందజేశారు. అలాగే ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక క్రీడా, యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫుట్‌బాల్, వాలీబాల్, హాకీ తదితర క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన విధానానికి క్రీడలు ఎంతో అవసరమని, ఫిట్‌నెస్‌ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. యు వత క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖకు సంబంధించిన బ్రాండింగ్ కిట్లను కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


