శిక్షలతోనే నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

శిక్షలతోనే నేరాల నియంత్రణ

May 24 2026 12:27 AM | Updated on May 24 2026 12:27 AM

వనపర్తి: సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణతో కోర్టుల్లో శిక్షల శాతాన్ని పెంచడం పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని, దీంతో ప్రజల్లో భద్రతాభావం, పోలీసులపై నమ్మకం, గౌరవం మరింత రెట్టింపు అవుతాయని అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, డీసీఆర్బీ అధికారులు, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని.. అనవసరంగా కేసులు పెండింగ్‌లో ఉండకుండా కోర్టు డ్యూటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన సాక్ష్యాలు, పత్రాలు, వాంగ్మూలాలు సమయానికి కోర్టుకు చేరేలా చూడడం బాధ్యతని తెలిపారు. అదేవిధంగా కోర్టు సమాచారం, విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్సైలకు తెలియజేయాలని, పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు, సమన్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన అమలు చేయాలన్నారు. అనంతరం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్‌ విభాగం సమన్వయంతో పనిచేస్తేనే కోర్టులో కేసులు బలపడతాయని తెలిపారు. కేసులకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు, సాక్షుల హాజరు విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ప్రతి కేసును బాధ్యతగా తీసుకొని సమగ్రంగా కోర్టులో ప్రవేశపెడితే శిక్షల శాతం గణనీయంగా పెరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, ఐటీ కోర్‌ సిబ్బంది గోవింద్‌, రవీందర్‌బాబు, డీసీఆర్బీ సిబ్బంది వెంకటన్నగౌడ్‌, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల కోర్టు డ్యూటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement