వనపర్తి టౌన్: స్థానిక పుర కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో మంగళవారం చైర్‌పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.63.74 కోట్ల వార్షిక అంచనా పద్దును ఎలాంటి కనీస చర్చ లేకుండానే కౌన్సిల్ ఆమోదించింది. మిగులు బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా రూ.55.31 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 2027, మార్చి 31 నాటికి ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మిగులు నిధులు రూ.3.04 లక్షలుగా ప్రతిపాదించారు. మొత్తం బడ్జెట్‌లో సొంత రాబడిని రూ.25.90 కోట్లుగా చూయించగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పన్నేతర ఆదాయాలు కలుపుకొని రూ.29.26 కోట్లుగా ప్రతిపాదించారు. ఆస్తి పన్ను రూ.12.23 కోట్లు, కొళాయి బిల్లు రూ.7.50 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ద్వారా రూ.85 లక్షలుగా.. పన్నేతర ఆదాయాన్ని రూ.13.67 కోట్లుగా పొందుపర్చారు. రూ.60.79 కోట్లు ఏడాది కాలంలో ఖర్చు కానున్నాయని.. 2027, మార్చి 31 నాటికి మిగులు నిధులు రూ.3.04 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఖర్చుల్లో అత్యధికంగా జీతభత్యాలకు రూ.6.30 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.2.70 కోట్లు, విద్యుత్ బిల్లులు రూ.3.20 కోట్లు, గ్రీన్ బడ్జెట్ రూ.2.59 కోట్లు, విలీన గ్రామాల అభివృద్ధికి రూ.2 కోట్ల చొప్పున అంచనాలు రూపొందించారు.
పలువురు సభ్యుల అభ్యంతరం..
బడ్జెట్ వివరాలను అకౌంటెంట్ జానకిరాములు చదవగా.. ఎంపీ నిధులను గత బడ్జెట్ కంటే తక్కువగా చూపారని 23వ వార్డు కౌన్సిలర్ పలుస శ్రీకర్‌గౌడ్ అభ్యంతరం తెలిపారు. గత బడ్జెట్‌లో పన్నుల ద్వారా చూపించిన ఆదాయానికి, ప్రస్తుతం చూయిస్తున్న ఆదాయానికి పొంతన లేదని 18వ వార్డు సీపీఎం కౌన్సిలర్ గంధం మదన్ ప్రశ్న లేవనెత్తారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు బదులిచ్చారు. గాంధీచౌక్‌లో శౌచాలయాలు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మూడేళ్లుగా అధికారులు ఎందుకు స్పందించడం లేదని అధికార పార్టీ సీనియర్ కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ ఎమ్మెల్యే ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. వేలం నిర్వహణలో పదేళ్లుగా అవకతవకతలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో నష్టం వాటిల్లుతుందని మండిపడటంతో నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. సీఓ సరస్వతి ఆర్పీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని 15వ వార్డు కౌన్సిలర్ సౌమ్య కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్ చర్యలకు కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం కోరగా పూర్తిస్థాయిలో పరిశీలించిన చేసిన తర్వాతే ముందుకెళ్దామని 21వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి అడ్డుచెప్పడంతో ప్రతిపాదన విరమించుకున్నారు. 19వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ మురళీసాగర్ మాట్లాడుతూ.. కొత్త కౌన్సిలర్లకు బడ్జెట్‌పై అవగాహన కల్పించకుండా సమావేశం నిర్వహించడం సరైంది కాదన్నారు. బడ్జెట్ సమావేశంలో పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
మున్సిపల్ అధికారులు గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా పనిచేస్తే కుదరదని.. పద్ధతి మార్చుకోకపోతే సెలవుపై వెళ్లాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో చేపట్టే రహదారి విస్తరణకు కౌన్సిల్ సభ్యులందరూ సహకరించాలని సూచించారు. ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్నామని.. లక్ష్యం చేరుకునేందుకు యత్నించాలన్నారు. ఈ ప్రాంత ప్రజలే తనకు ప్రాణపదమని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇక్కడి వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారు కానుందన్నారు. మున్సిపాలిటీకి తాను తీసుకొచ్చిన రూ.18 కోట్ల అభివృద్ధి పనులు ఏయే దశలో ఉన్నాయో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వసూళ్లలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, లేకపోతే కేంద్ర నిధులు రావన్నారు.
రహదారి విస్తరణకు
సహకరించాలి..
కనీస చర్చ లేకుండానే పద్దులకు ఆమోదం


