కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని సోమవారం ఆశా కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాలు మారినా ఆశా కార్యకర్తల జీవితాలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు మూడుసార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించినా.. ఆశాల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. పని భారం అధికంగా ఉందని.. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆశాలు చలో అసెంబ్లీ నిర్వహిస్తే ప్రభుత్వం పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించడం సరికాదన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎన్ రమేష్, కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసులతో ఆశా కార్యకర్తలను నిర్బంధించడం మానుకోవాలన్నారు. కుష్టు సర్వే బకాయి డబ్బులు, రెండు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, జిల్లా సహాయ కార్యదర్శులు సూర్యవంశం రాము, రాజు, ప్రసాద్, మద్దిలేటి, ఆశా కార్యకర్తలు భాగ్య, గిరిజ, దేవమ్మ, అనిత, రాణి, అనసూయ, పుష్ప, సంతోష, స్వాతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


