ఆదాయం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదాయం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి

Mar 31 2026 9:02 AM | Updated on Mar 31 2026 9:02 AM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

కొత్తకోట రూరల్‌: పురపాలక సంఘాలు తమ సొంత ఆదాయాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ సూచించారు. సోమవారం స్థానిక పుర కార్యాలయంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశం చైర్‌పర్సన్‌ అరుణ శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించారు. పుర కమిషనర్‌ సైదయ్య బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్‌ సొంత ఆదాయం రూ.483.80 లక్షలు కాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు రూ.588.00 లక్షలుగా అంచనా వేశారు. మొత్తం అంచనా ఆదాయం రూ.1071.80 లక్షలకు చేరుకుందని వెల్లడించారు. ఇందులో వేతనాలకు రూ.180.00 లక్షలు, పారిశుద్ధ్యానికి రూ.77.10 లక్షలు, విద్యుత్‌ బిల్లులు రూ.130 లక్షలు, హరిత నిధికి రూ.60 లక్షలు, ఇంజినీరింగ్‌ విభాగానికి రూ.125 లక్షలు, సాధారణ పరిపాలనకు రూ.55.70 లక్షలు, టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి రూ.6 లక్షలు కేటాయించినట్లు వివరించారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం 1/3 బడ్జెట్‌ నిబంధన ప్రకారం అభివృద్ధి చెందని ప్రాంతాలకు రూ. 23.00 లక్షలు, ప్రజా అభివృద్ధి పనులకు రూ.11.50 లక్షలు, వార్డుల వారీగా అభివృద్ధి పనులకు రూ.80.00 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 68.80 లక్షల మిగులు నిధి ఉండనున్నట్లు అంచనా వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. వార్డుల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం, ఫాగింగ్‌, అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పుర వైస్‌ చైర్‌పర్సన్‌ పల్లవి, కౌన్సిల్‌ సభ్యులు, పుర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement