క్యూఆర్ కోడ్‌తో కేంద్రం గుర్తింపు
నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు
● హాజరుకానున్న 12,653 మంది విద్యార్థులు
● జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాట్లు
● నిమిషం నిబంధన ఎత్తివేత
పకడ్బందీగా నిర్వహణ..
ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డ్యూయల్ డెస్క్ బెంచీలు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాం. ప్రతి గదిలో గోడ గడియారం అందుబాటులో ఉంచాం. దీంతో విద్యార్థులు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణను ఇంటర్మీడియట్ బోర్డు అనుక్షణం పరిశీలించనుంది.
– ఎర్ర అంజయ్య, డీఐఈఓ
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పరీక్ష కేంద్రం గుర్తింపునకు బోర్డు అధికారులు హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. దీంతో కేంద్రం ఎంత దూరంలో ఉంది.. మార్గమధ్యంలో ట్రాఫిక్ సమస్యను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కేంద్రానికి ఎంత సమయంలో చేరుకోవచ్చో చూయిస్తుంది. బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు క్యూఆర్ కోడ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. కాగా పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ ఎర్ర అంజయ్య పరిశీలించి ఏర్పాట్లు, వసతుల కల్పనపై ఆరా తీశారు. అంతేగాకుండా కేంద్రాల్లో బెంచీలపై వేసిన హాల్‌టికెట్ నంబర్లను పరిశీలించారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనుండగా.. కేంద్రంలోకి అరగంట ముందే అనుమతించనున్నారు. ప్రశ్నాపత్రాలను నిర్ధేశిత సమయంలో సీసీ కెమెరాల ఎదుట తెరవనున్నారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇన్విజిలేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లకు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి నిరాకరించింది. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసుశాఖ సమన్వయంతో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించనున్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు నిరంతరం కౌన్సిలింగ్ ఇచ్చేందుకు టెలిమానస్ పేరుతో టోల్‌ఫ్రీ నంబర్ 14416 అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయడంతో పాటు కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. కేంద్రాల్లోని సీసీ కెమెరాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖతో పాటు రాష్ట్ర డైరెక్టరేట్‌కు అనుసంధానం చేశారు. విద్యార్థులు అస్వస్థత, అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. కేంద్రాల వద్ద స్వచ్ఛతకు మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికుల సేవలు వినియోగించుకుంటున్నట్లు డీఐఈఓ వివరించారు.
జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 6,216 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 6,437 మంది, మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యధికంగా వనపర్తిలో 13, కొత్తకోటలో 3, ఆత్మకూర్‌లో 2, మిగతా మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. పరీక్ష సమయం దాటిన ఐదు నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలయం నిబంధనకు స్వస్తి పలికారు. విద్యార్థులు 8 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని.. 8.30 నుంచి విద్యార్థులను తనిఖీ చేసి లోనికి అనుమతిస్తారు.


