శిల్పకళా నిలయం.. శ్రీరంగాపురం
నేటి నుంచి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
● 2న శ్రీవారి కల్యాణం.. 4న రథోత్సవం
● వచ్చే నెల ఆరోతేదీ వరకుకొనసాగనున్న జాతర
వనపర్తి రూరల్: జిల్లాలోని పురాతన వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా పేరొందిన శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది పండుగ వరకు జాతర కొనసాగుతుంది. అన్ని ఆలయాల్లో రాత్రి వేళల్లో రథోత్సవం జరుగుతుండగా.. ఇక్కడ మాత్రం ఉదయం 10.30 గంటలకు రథోత్సవం నిర్వహించడం విశేషం. ఉత్సవాలకు స్థానికులేగాకా వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
మండలంలోని కొర్విపాడు (నేటి శ్రీరంగాపురం)లో సుమారు 340 ఏళ్ల క్రితం (క్రీ.శ.1670 కాలంలో..) సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది. గ్రామంలోని రంగసముద్రం చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన రంగనాయకస్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది. శ్రీరంగనాథస్వామి ఆలయం నిర్మాణంతో కొర్విపాడుగా పిలుచుకునే గ్రామం శ్రీరంగాపురంగా వాడుకలోకి వచ్చిందని ప్రతీతి. తమిళనాడులోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీరంగంకు సమానంగా ఇక్కడి శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామివారిని దర్శించుకునే శక్తిలేని భక్తులు శ్రీరంగాపురంలోని ఆలయాన్ని దర్శించి తరించవచ్చని భక్తుల నమ్మకం.
ఆలయంలోని అద్భుతమైన శిల్పకళా సంపద భక్తులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఆకాశాన్నంటే అంతస్తులతో ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమ వైపున చతుర్భుజ తాయారు ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం పక్కనే నాటి ప్రభువులు నిర్మించిన రంగసముద్రం అనే సువిశాలమైన చెరువు చూపరులను ఆకట్టుకుంటుంది.
ఆలయ చరిత్ర..
ఉట్టిపడే శిల్పకళా సంపద..
కార్యక్రమాల వివరాలు..
బుధవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, రాత్రి విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అంకురార్పణ, భేరీపూజ
గురువారం ధ్వజారోహణం, రాత్రి దేవత ఆహ్వానం, భేరీపూజ
27న ఉదయం శ్రీవారి మూలమంత్ర హవనం, రాత్రి సూర్యప్రభ వాహనం
28న రాత్రి శేషవాహన తిరువీధి సేవ
మార్చి 1న రాత్రి హనుమద్వాహన సేవ, మండపోత్సవం.
2న చతుస్థానార్చన, సాయత్రం 6 గంటలకు మోహిని అలంకారం, రాత్రి 8 గంటలకు గరుడవాహన సేవ, 10 గంటలకు శ్రీవారి కల్యాణం
3న ఉదయం శ్రీవారి సేవ, గజవాహన సేవ
(చంద్ర గ్రహణం సందర్భంగా అనంతరం ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు ఆలయం మూసివేత)
4న ఉదయం 10 గంటలకు రథోత్సవం, తిరిగి రాత్రి 10.30 గంటలకు రథోత్సవం
5న ఉదయం శ్రీవారి మూలమంత్ర హవనం, రాత్రి పార్వేట, అశ్వవాహన సేవ
6న ఉదయం పూర్ణాహుతి, అవభృత స్నా నం, తీర్థప్రసాద వితరణ, రాత్రి ధ్వజ అవరోహణం, నాగవెల్లితో ఉత్సవాల ముగింపు.
శిల్పకళా నిలయం.. శ్రీరంగాపురం
శిల్పకళా నిలయం.. శ్రీరంగాపురం


