లైసెన్స్‌డ్ సర్వేయర్లు బాధ్యతగా వ్యవహరించాలి
వనపర్తి: రాబోయే రోజుల్లో భూ సమస్యల పరిష్కారంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని.. నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ వివాదాల పరిష్కారంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పనిచేయాలన్నారు. మండలస్థాయిలో సర్వేయర్లకు అవసరమైన సహకారం అందించాలని, సర్వే ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, నిర్లక్ష్యానికి తావు లేదని హెచ్చరించారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. సర్వేశాఖ ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ..
జిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతరెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షలకు 12,653 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. 25 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే పదోతరగతి పరీక్షలు 7,228 మంది విద్యార్థులు 37 పరీక్ష కేంద్రాల్లో రాయనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లకు తావు ఇవ్వొద్దని సూచించారు. పరీక్ష కేంద్రాల ఆవరణ, ప్రశ్నపత్రాల తరలింపు సమయంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చూడాలని, కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల ఆవరణలో బీఎన్‌ఎస్ 163 (సీఆర్పీసీ 144 సెక్షన్) అమలు చేయాలని, కేంద్రాల్లో తాగునీరు, సౌకర్యవంతమైన బెంచీలు, సరైన వెలుతురు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామీణ విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడపాలని సూచించారు. జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య పాల్గొన్నారు.


