పూత దశలో పురుగు మందులు వాడొద్దు
వీపనగండ్ల: మామిడి రైతులు పూత దశలో పురుగు మందులను వినియోగించడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, మదనాపురం రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గోవర్ధనగిరిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడి రైతులకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. అధిక మొత్తంలో రసాయన ఎరువులు వాడటంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయని,, వేపనూనె పిచికారీ చేసుకోవడంతో అధిక ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం, కూరగాయలు, పండ్ల తోటల పెంపకం చేపడితే ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందిస్తోందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి కృష్ణ, ఉద్యాన విస్తరణ అధికారులు భానుప్రకాష్, శిరీష, కో–ఆర్డినేటర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తే చర్యలు
ఖిల్లాఘనపురం: కాంటాలు రెన్యూవల్ చేయకుండా తూకాలు చేయడం, కాలం చెల్లిన వస్తువులు విక్రయించడం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కొలతలు, తూనికల అధికారి రవీందర్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. కాంటాల రెన్యూవల్, కాలం చెల్లిన సామగ్రి విక్రయం లాంటివి గుర్తించి మూడు కేసులు నమోదు చేశామని చెప్పారు. అదేవిధంగా ఇద్దరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించామన్నారు. చెల్లించిన వారికి బుధవారం రసీదులు అందజేస్తామని తెలిపారు.
‘కుమ్మెర ఘటనపై సీఎం స్పందించాలి’
కొత్తకోట: కుమ్మెర ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించాలని, నిందితులను కఠినంగా శిక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ గౌనికాడి రాములు యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ కులసంఘాల నాయకులు పట్టణంలోని కూడలిలో ధర్నా చేపట్టగా ఆయన హాజరై మాట్లాడారు. పసికందు మరణం తెలంగాణ రాష్ట్రాన్ని దుఃఖంలో ముంచెత్తిందని.. రెండునెలల పాప ప్రాణాలు కోల్పోడానికి కారకులైన 8 మందిపై తక్షణమే కేసునమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం, నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ వైపు ముందుకు సాగుతామని వివరించారు. కార్యక్రమంలో నిక్సన్, గంగాధర్, విజయ్, శివశంకర్, హోటల్ కురుమూర్తి, భాస్కర్, కిషన్‌నాయక్, రజక సంఘం నాయకులు లక్ష్మయ్య, బాలస్వామి, బాలరాజు, రాములు, రవి, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


