సీడ్ పత్తి రైతులకు న్యాయం చేయాలి
గద్వాల: నడిగడ్డలోని సీడ్ పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా మని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. నడిగడ్డలో పండించిన సీడ్ పత్తి దేశంలోనే పేరుగాంచిందని, అంతటి నాణ్యమైన పంటను పండిస్తున్న రైతులను ఆర్గనైజర్లు, కంపెనీలు నిండా ముంచుతున్నాయని మండిపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నారని, ఆయనకు ఏమైనా నీతి, నిజాయితీ ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో అత్త, అల్లుడు వస్తారు.. మూటలు, ముల్లెలతో దిగి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత మోసం చేయడం ఆనవాయితీగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అత్త, అల్లుడు రాజకీయానికి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని, అది నడిగడ్డకు వజ్రాయుధంగా మారుతుందన్నారు. మార్పు ఈ ప్రాంతం నుంచే మొదలుపెడతామన్నారు. రాబో యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి కొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతామన్నారు. అనంతరం ఆమె రైతులతో కలిసి కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్లగా.. అక్కడ నాటకీ య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కవితను కలెక్టరేట్‌లోకి వెళ్లనీయకుండా పోలీసులు గేటు మూసివేసి అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆమె కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆమె కలెక్టరేట్‌లోకి వెళ్లి కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రంజిత్‌కుమార్, బుచ్చిబాబు, లవన్న, గోవిందు పాల్గొన్నారు.
సీడ్ పత్తి రైతులకు న్యాయం చేయాలి


