ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ
అలంపూర్: పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో ముందుకెళ్లాల్సి ఉండగా.. బీజేపీ ప్రభుత్వం ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అఖిలపక్ష పార్టీలతో చర్చించకుండానే పార్లమెంట్‌లో ఏకపక్షంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి.. వీబీజీ రామ్‌జీ బిల్లు ఆమోదం చేసుకున్నారన్నారు. విద్యుత్ సవరణ బిల్లు అమలులోకి వస్తే అట్టడుగు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. విత్తన సవరణ బిల్లుతో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందని విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తుందన్నారు. ఓటరు సవరణతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలకు దూరం చేస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి.. నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో దైవ దర్శనం కోసం వెళ్లిన వారిపై దాడిచేసి చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలంపూర్ ఆలయాల్లో కేంద్రమంత్రి
అలంపూర్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అలంపూర్ హరితహోటల్ వద్ద కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వాగతం పలికి.. శాలువాలతో సత్కరించి పూలబొకే అందజేశారు. అనంతరంపోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆలయాలకు వెళ్లి.. కేంద్రమంత్రి దంపతులు అభిషేకం, కుంకుమార్చన, ఇతర ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు వారికి శేషవస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. స్వామి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. జోగుళాంబ దేవిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అని, మరోసారి అమ్మవారి దర్శనానికి వస్తానని ఈ సందర్భంగా కుమారస్వామి పేర్కొన్నారు. కేంద్రమంత్రి పర్యటనను పురస్కరించుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ మొగిలయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఈఓ దీప్తి, మున్సిపల్ కమిషనర్ శంకర్ ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.


