ప్రలోభాల పర్వం షురూ
వనపర్తి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుండగా.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. జిల్లాలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో పల్లెల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఓటు కీలకం కావడంతో కొందరు అభ్యర్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. తమ వారు హైదరాబాద్ నుంచి రావాలని.. బస్సులో వస్తే మధ్యాహ్నం 1గంట దాటుతుందని.. వారు కారు తీసుకొని వస్తారని.. కారు కిరాయి, టీ, టిఫిన్, భోజనం, డ్రైవర్ బత్తా కలిసి రూ. 10వేల వరకు అవుతుందని.. వారిని రమ్మంటావా.. వద్దంటావా అని అభ్యర్థులకు చెబుతుండటంతో పరేషాన్‌లో పడుతున్నారు. ఎవరూ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తే.. కొందరు ముంబాయి, హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఉన్నా రని చెబుతుండటంతో ఖంగుతింటున్నారు.
● పోలింగ్‌కు 48 గంటల ముందుగానే ప్రచార కార్యక్రమాల నిషేధం అమలులోకి వచ్చింది. సభలు, సమావేశాల నిర్వహణ, స్పీకర్ల వినియోగం, ప్రచారం, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఐదుగురు వ్యక్తులు లేదా గుంపులుగా ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు. కాగా, మద్యం దుకాణాలు శనివారం సాయంత్రం నుంచే మూతపడ్డాయి.


