మూడో విడత.. రసవత్తరం
● పంచాయతీల్లో పాగా కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు
● రెబల్స్‌తో అధికార పార్టీకి తగ్గుతున్న స్థానాలు
● పొత్తులతో ఢీ అంటున్న బీఆర్‌ఎస్
● రాజకీయ వేడిని
రాజేస్తున్న నేతల మాటలు
వనపర్తి: పంచాయతీ ఫైనల్ పోరుపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తొలి, మలి విడతలో చోటు చేసుకున్న పొరపాట్లతో ఆధిక్యం సాధించినా అసంతృప్తిలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మూడో విడత వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ ఎత్తుకు పైఎత్తు వేసే ప్రయత్నంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం ముగియడంతో వలస ఓటర్లు, ప్రత్యర్థుల తరుఫున ఉన్న ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం గడిచిన రెండు విడతల్లో ఆశించిన కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందడంతో క్యాడర్‌లో మరింత జోష్ నింపుతూ.. ఆయా ప్రాంతాల్లో అనుకూలత మేరకు పొత్తులతో అఽధికార పార్టీకి చుక్కలు చూపించే ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో అధికార పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైందనే అసహనం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ కారణంగానే చాలా గ్రామాల్లో ఫలితాలు తారుమారయ్యాయని పార్టీ పెద్దలకు చెబుతున్నట్లు తెలిసింది.
బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్ ఢీ..
జిల్లాలోని పలు జీపీల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు ఏకం కావడం.. అధికార కాంగ్రెస్‌లో రెబల్స్ సమస్య ప్రతిపక్ష పార్టీలకు కలిసొచ్చే అంశాలని చెప్పవచ్చు. ఈ కారణంగా జిల్లాలోని మదనాపురం, వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట మండలాల్లో అఽధికార పార్టీకి జీర్ణించుకోలేని ఫలితాలు వెలువడ్డాయి. వాటిని పూడ్చుకునేందుకు పలువురు సర్పంచులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నిమగ్నమైనట్లు తాజా చేరికలతో స్పష్టమవుతోంది.
మాటలు తెచ్చిన పొలిటికల్ హీట్..
పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాయకుల ప్రసంగాలు తెచ్చిన పొలిటికల్ హీట్ కొన్ని ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నేతల వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ.. ఎన్నికల్లో ఆధిక్యం సాధించే ఎత్తుగడలు వేస్తున్నాయి. ముఖ్యంగా దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లో నేతలు, వారి కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికాార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ గ్రామస్థాయి నాయకులు సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు గుప్పిస్తూ.. చేస్తున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


